TCS Work From Home Update: దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొత్తం 6.14 లక్షల మందికిపైగా ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో ఇక ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరింది. వర్క్ ఫ్రం హోంకు (ఇంటి నుంచి పని) స్వస్తి పలికినట్లు వివరించారు టీసీఎస్ హ్యూమన్ రీసోర్సెస్ అధికారి మిలింద్ లక్కడ్. ఇలా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తీసేసి.. అందరినీ ఆఫీసులకు రావాలని చెప్పిన అతిపెద్ద, తొలి ఐటీ కంపెనీ ఇదే కావడం గమనార్హం. సిబ్బంది అంతా కలిసి పనిచేయడం వల్ల ఉత్పాదకత ప్రయోజనాలు ఉంటాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అవసరమని అన్నారు లక్కడ్.
ఈ వర్క్ ఫ్రం హోం తొలగిస్తున్నట్లు ఇటీవలనే ప్రకటించినట్లు వార్తలొచ్చినా.. అది ఉద్యోగులకు మెయిల్ పంపిన వివరాలను పలు మీడియా సంస్థలు ఉటంకించాయి. ఇప్పుడు కంపెనీనే అధికారిక ప్రకటన చేసింది. దీంతో ఇక ఉద్యోగులు వారంలో ఐదు రోజులు ఆఫీసులకు వెళ్లాల్సిందే. మొన్నటివరకు వారంలో 3 రోజులు ఆఫీసుకు, రెండు రోజులు ఇంటి దగ్గర ఇలా హైబ్రిడ్ మోడల్ వర్క్ నడిచింది.
వారందరికీ ఆఫర్ లెటర్లు ఇస్తాం..
ఫలితాల ప్రకటన సందర్భంలో లక్కడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 40 వేల మందికిపైగా ఫ్రెషర్లను ఈ ఆర్థిక సంవత్సరంలో నియమించుకుంటామని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు మిలింద్. ఇదే సమయంలో కంపెనీ ఇచ్చిన ఆఫర్ లెటర్స్ అన్నింటినీ గౌరవిస్తామని.. వారికి ఉద్యోగం కల్పించేందుకు కాస్త ఆలస్యం అవుతున్నా.. తప్పనిసరిగా అవకాశం ఇస్తామని చెప్పుకొచ్చారు.
Advertisement
కంపెనీ మొత్తం సిబ్బంది సంఖ్య 6.15 లక్షల నుంచి 6.08 లక్షలకు తగ్గడంపైనా మాట్లాడారు మిలింద్. వలసలతో పోల్చి చూస్తే.. కొత్త నియామకాలు తక్కువగా ఉండటమే దీనికి కారణమని ఆయన చెప్పారు. ఇజ్రాయెల్‌లో దాదాపు తమ 250 మంది సిబ్బంది ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నారని.. ప్రస్తుత యుద్ధం వల్ల పెద్ద ప్రభావమైతే లేదని అన్నారు. సిబ్బందిలో ఎక్కువ మంది స్థానికులేనని.. వారిని కంపెనీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని వివరించారు.
Advertisement
Advertisement